శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (08:37 IST)

జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం : హర్షవర్థన్

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్థన్ దేశ ప్రజలకు ఓ శుభవార్త చెప్పార. వచ్చేనెలలో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆ తర్వాత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వచ్చేనెలలో ఏ దశలోనైనా, ఏ వారంలోనైనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని, దేశ ప్రజలకు తొలి కొవిడ్‌ వ్యాక్సిన్‌ షాట్‌ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉండాలన్నారు. అయితే వ్యాక్సిన్‌ భద్రత, సమర్థత తమ మొదటి ప్రాధాన్యమని, ఈ విషయంలో రాజీపడే అవకాశమే లేదన్నారు. 
 
దేశంలో అత్యవసర వినియోగానికి కొన్ని వ్యాక్సిన్‌ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని, వాటిని డ్రగ్‌ రెగ్యులేటర్‌ విశ్లేషిస్తున్నారని చెప్పారు. అయితే వ్యాక్సిన్‌ పరిశోధనల విషయంలో భారత్‌ ఏ దేశానికి తీసిపోలేదన్నారు. 
 
టీకా సమర్థత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. దేశంలోని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు స్వదేశీ వ్యాక్సిన్‌పై పనిచేస్తున్నారని, వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో దేశంలో 30 కోట్లమందికి టీకాలు వేసే సామర్థ్యం తమకుంటుందని చెప్పారు. 
 
ప్రస్తుతం మన దేశంలో ఆరు కరోనా వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని చెప్పారు. అందులో కొవీషీల్డ్‌, కోవాక్సిన్‌, జింకోవిడ్‌, స్పుత్నిక్‌ వీ, ఎన్‌వీఎక్స్‌-కోవ్‌2373 టీకాల పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి అన్నారు.