కెనడాకు షాకిచ్చిన భారత్.. వీసాల జారీ నిలిపివేత
కెనడాకు భారత్ ఊహించిని షాక్ ఇచ్చింది. కెనడా వాసులకు వీసాల జారీని నిరవధికంగా నిలిపివేసింది. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ వ్యాఖ్యలు చేయడమే కాకుండా, భారతదేశానికి చెందిన ఇంటెలిజెన్స్ హెడ్‌ను తమ దేశం నుంచి బహిష్కరించడం తెలిసిందే. దీంతో భారత్ సైతం కెనడా సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.
దీనికి కొనసాగింపుగా భారత్ లోని కాశ్మీర్‌లో కిడ్నాప్‌లు అల్లర్లు, అశాంతి, ఉగ్రవాద చర్యల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే కెనడా పర్యాటకులు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కెనడా సూచనలు చేసి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కెనడాలో మారిన పరిణామాల నేపథ్యంలో భారత సంతతి వారు తమ భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ భారత్ సైతం సూచనలు జారీ చేసింది.
కెనడా వాసులకు వీసా సేవలను నిరవధికంగా నిలిపివేసినట్టు సమాచారం. దీనిపై భారత్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాకపోతే వీసా సేవలను ఔట్ సోర్స్ రూపంలో అందించే బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ తన కెనడియన్ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించి ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.
'భారత మిషన్ నుంచి ముఖ్యమైన సందేశం. నిర్వహణ కారణాల రీత్యా సెప్టెంబర్ 21 నుంచి భారత వీసా సేవలను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిలిపివేయడమైనది' అని పేర్కొంది. దీనిపై భారత్‌కు చెందిన ఓ అధికారి అనధికారికంగా మాట్లాడుతూ.. వీసా సేవల నిలిపివేతను ధ్రువీకరించారు.