నేటితో ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్)కు ఆఖరు తేదీ..
దేశంలో ఆదాయపన్ను రిటర్న్స్‌లు (ఐటీఆర్) దాఖలు చేసేవారి చివరి తేదీ జూలై 31వ తేదీ సోమవారంతో ముగియనుంది. దీంతో అనేక మంది ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు పోటీపడుతున్నారు. గత 2022లో మొత్తం 7.4 కోట్ల మంది ఐటీ రిటర్న్స్‌లు దాఖలు చేయగా ఈ యేడాది ఇప్పటివరకు 5.83 కోట్ల మంది ఐటీఆర్‌లు దాఖలు చేశారు. ఐటీ రిటర్నుల దాఖలుకు నేడు తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో ఐటీఆర్‌లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆదివారం ఒక్కరోజే భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. చివరి ఒక గంట వ్యవధిలో ఏకంగా 3.04 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఐటీ పోర్టల్‌లోకి 1.78 కోట్ల మంది లాగిన్ కాగా, సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెప్పారు. సెలవు రోజైన ఆదివారం మధ్యాహ్నం వరకు 10.39 లక్షల ఐటీఆర్‌లు దాఖలు కావడం గమనార్హం.
కాగా, ఇప్పటివరకు దాఖలు చేసినవారే కాదు.. ఇంకా దాఖలు చేయాల్సినవారు 2 కోట్లమందికి పైగా ఉన్నారు. వీరంతా ఆఖరు రోజైన సోమవారం దాఖలు చేసేందుకు పోటీపడే అవకాశం. జూలై 31వ తేదీ తర్వాత అపరాధ రుసుంతో ఐటీఆర్ దాఖలు అనుమతిస్తామని ఆదాయన్నుశాఖ అధికారులు వెల్లడించారు.