బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 డిశెంబరు 2020 (12:53 IST)

''తలైవి'' వర్ధంతి నేడు.. వెండితెరపై వెలిగిన తార.. ''అమ్మ''గా నిలిచిపోయింది

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార జయలలిత. తమిళనాట తలైవిగానూ జేజేలు అందుకున్న ఆమె డిసెంబర్ 5వ తేదీన మృతి చెందారు. తమిళం, తెలుగుతో పాటు దక్షిణాది తారగా.. బాలీవుడ్‌లో సక్సెస్ కాకపోయినా మంచి గుర్తింపు సంపాందించిన జయలలిత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2016, డిసెంబర్ 5వ తేదీన మృతి చెందారు.
 
తెలుగు చిత్రసీమలో జయలలిత అడుగు పెట్టడంతోనే అదరహో అనిపించింది. అప్పటి దాకా తెలుగు సినిమా 'ఏ' సర్టిఫికెట్‌ను చూసి ఉండలేదు. జయలలిత తొలి తెలుగు చిత్రం 'మనుషులు - మమతలు'తోనే తొలి ఏ సర్టిఫికెట్ మూవీని చూసింది తెలుగు సినిమా. 
 
అందాల ఆరబోతకు సై అంటూనే అభినయప్రాధాన్యమున్న చిత్రాలలో మురిపించారు జయలలిత. తొలి సినిమాతోనే తనదైన బాణీ పలికించిన జయలలిత, ఆ సినిమాతో ఆట్టే ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అయినా, రసపిపాసుల హృదయాల్లో గిలిగింతలు పెట్టింది.
 
తెలుగు సినిమారంగంలో మహానటుడు ఎన్టీఆర్‌తో కలసి జయలలిత విజయయాత్ర చేసింది. వారిద్దరూ నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. నటరత్న సరసన జానపద, పౌరాణిక, సాంఘికాల్లో నటించి పలు విజయాలను సొంతం చేసుకున్నారామె. 
 
అలాగే తమిళనాట అందాలతారగా జైత్రయాత్ర చేసిన జయలలిత, ఎమ్జీఆర్ ప్రోత్సాహంతో తమిళనాట రాజకీయాల్లో ప్రవేశించారు. ఎమ్జీఆర్ అనంతరం అన్నాడీఎంకే పార్టీని విజయతీరాలకు చేర్చిన ఘనత జయలలిత సొంతం. ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉంది కూడా జయలలిత అనుయాయులే.