బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (14:24 IST)

రూ.40 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు

Cash
కర్నాటక రాష్ట్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు ఒకరు రూ.40 లక్షల లంచం పుచ్చుకుంటూ లోకాయుక్త పోలీసుల చేతికి చిక్కాడు. బీజేపీ ఎమ్మెల్యేగా కె.మదల్ విరూపాక్ష ఉన్నారు. ఈయన కుమారుడు ప్రశాంత్ మదల్. ఈయన తన తండ్రి కార్యాలయంలోనే రూ.40 లక్షల లంచం తీసుకుంటుంటగా లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆయన టేబుల్‌పైనే నోట్ల కట్టలు కుప్పలుగా పోసివున్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
కాగా, బెంగుళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు‌లో ప్రశాంత్ చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కర్నాటక్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఛైర్మన్‌ కూడా అయిన ఆయన తండ్రి తరపున లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం ఇపుడు సంచలనంగా మారింది. మరికొన్ని నెలల్లో కర్నాటక అసెంబ్లీలో ఎన్నికలు జరగాల్సివుంది. ఇలాంటి తరుణంలో ఒక బీజేపీ ఎమ్మెల్యే తనయుడు తన తండ్రి తరపున లంచం పుచ్చుకుంటూ పట్టుబడటం ఇపుడు సంచలనంగా మారింది. 
 
నిజానికి డిమాండ్ చేసిన లంచం మొత్తం రూ.81 లక్షలు కాగా, రూ.40 లక్షలు తీసుకుంటూ ఆయన పట్టుబడినట్టు లోకాయుక్త తెలిపింది. ప్రశాంత్ గతంలో ఏసీబీ (ప్రస్తుతం ఉనికిలో లేదు) ఫైనాన్షియల్ అడ్వైజర్‌గానూ పనిచేశారు. ఏసీబీని మూసివేశాక దాని స్థానంలో లోకాయుక్త ఏర్పాటైంది. ఆ తర్వాత ఆయన లోకాయుక్తలో చేరేందుకు కూడా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ పట్టుబడిన కార్యాలయం నుంచి రూ.1.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.