లైంగికంగా వేధిస్తున్నారా? కాలితో తన్నితే చాలు విద్యుత్ షాక్..!
లైంగిక వేధింపులు, దాడుల నుంచి మహిళలు తమను తాము రక్షించుకునే విధంగా.. కర్ణాటకకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎలక్ట్రిక్ షూను రూపొందించింది.
కర్ణాటక, కలపురికి చెందిన విద్యార్థిని విజయలక్ష్మి తన ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ.. 'ఎవరైనా మహిళపై దాడికి ప్రయత్నించినప్పుడు, లేదా ఆమె లైంగిక వేధింపులకు గురైనప్పుడు, మహిళ ఈ షూతో ప్రత్యర్థిని తన్నాలి. అప్పుడు ఈ బూట్ల నుంచి వెలువడే విద్యుత్ ప్రత్యర్థిపై ప్రవహించి వారిని అస్థిరపరుస్తుంది.
దీనికి అవసరమైన విద్యుత్తును బ్యాటరీల సాయంతో షూల ద్వారా పంపిస్తారు. నేరస్థులతో పోరాడేందుకు మహిళలకు ఇది దోహదపడుతుంది. ఈ షూస్ వేసుకుని నడిచినప్పుడు బ్యాటరీ చార్జింగ్ అవుతుంది' అని చెప్పింది.
ఇది కాకుండా, జీపీఎస్ కూడా ఈ షూలో అందుబాటులో ఉంది. ఇది బాలిక ఎక్కడ ఉందో తల్లిదండ్రులకు సమాచారం పంపుతుంది. 2018లో విజయలక్ష్మి ఈ ప్రత్యేకమైన షూని రూపొందించే ప్రయత్నాన్ని ప్రారంభించింది.
ఈ ఆవిష్కరణ కోసం విజయలక్ష్మి పతకాలు అందుకుంది. ఇటీవల గోవాలో తన ఆవిష్కరణకు అంతర్జాతీయ అవార్డును గెలుచుకోవడం విశేషం.