కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. బరిలో 2615 మంది అభ్యర్థులు
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. మొత్తం 224 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా.. దక్షిణాది రాష్ట్రంలో సత్తా చాటి జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్టను పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. మరో కీలక పార్టీ అయిన జేడీఎస్ హంగ్ అసెంబ్లీపై గంపెడాశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఓటర్లు తన తీర్పును ఈవీఎంల్లో నిక్షిప్తం చేయనున్నారు. కర్ణాటకలో 224 స్థానాలకు గానూ 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 5,31,33,054 (5.31 కోట్ల మంది) ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,67,28,053 (2.67 కోట్లు) మంది పురుషులు కాగా.. 2,64,00,074 (2.64 కోట్లు ) మంది స్త్రీలు ఉన్నారు.
వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. 224 స్థానాలు కలిగిన కర్ణాటక అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు రావాలి. 2018 ఎన్నికల్లో భాజపా 104 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 స్థానాల్లో గెలుపొందాయి.
ఏ ఒక్క పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో 2018 ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన్పటికీ.. మూడు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. కుమారస్వామి సీఎంగా కొనసాగారు. ఈ ప్రభుత్వం 14 నెలలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత భాజపా మళ్లీ అధికారంలోకి వచ్చింది.
ప్రస్తుతం కన్నడ అసెంబ్లీలో భాజపాకు 116 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్‌కు 69 మంది, జేడీఎస్‌కు 29 మంది ఉన్నారు. బీఎస్పీ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గడిచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో ఏ ఒక్క పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని భాజపా భావిస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోడీ, అమిత్ షా, నడ్డా వంటి బడా నేతలంతా కర్ణాటక ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించారు.
గతంలో జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ.. అధికారంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ నిలవలేకపోయింది. కాబట్టి ఈ సారి ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్ దాటాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. స్థానిక అంశాలే ప్రధానంగా ప్రచారాన్ని హోరెత్తించింది. 2018 ఎన్నికల్లో 72.36 శాతం ఓటింగ్ నమోదైంది. వారానికి మధ్యలో ఈ సారి బుధవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటింగ్ ఎక్కువే నమోదు కావొచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది.