బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2024 (14:09 IST)

బైక్ రైడ్‌ను రద్దు చేసిన మహిళ... అసభ్య వీడియోలతో డ్రైవర్ వేధింపులు...

arrest
బుక్ చేసిన బైక్ రావడం ఆలస్యం కావడంతో రైడ్ బుకింగ్‌ను ఓ మహిళా వైద్యురాలు రద్దు చేసింది. దీన్ని జీర్ణించుకోలేని బైకర్ (డ్రైవర్)... ఆ వైద్యురాలికి పలుమార్లు ఫోన్ చేయడమేకాకుండా, అసభ్య వీడియోలు పంపించి వేధించాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా నగరంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు ఒకరు శనివారం రాత్రి ఓ యాప్‌లో బైక్ రైడింగ్ బుక్ చేశారు. అయితే, బైక్ రావడం ఆలస్యం కావడంతో రైడ్‌ బుకింగ్‌ను రద్దు చేశారు. రైడ్ రద్దు చేసిందన్న ఆగ్రహంతో ఆ రైడర్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. వైద్యురాలికి 17సార్లు ఫోన్ చేయడంతోపాటు ఆమె వాట్సాప్‌నకు అశ్లీల వీడియోలు పంపాడు. 
 
అక్కడితో ఆగకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో భయపడిన వైద్యురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.