మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 మార్చి 2020 (17:22 IST)

జనతా కర్ఫ్యూ మద్దతుపై ప్రధాని హర్షం.. 75 జిల్లాల్లో లాక్ డౌన్

కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నెల 31 వరకూ దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో మెట్రో రైళ్లను, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ సమయంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ఇంటికే పరిమితమైనందుకు ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. 
 
స్వచ్ఛందంగా జనం నుంచి దూరంగా ఉండటం, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండటం ద్వారా లక్షలాది మంది ప్రజలు స్పందించిన తీరు అభినందనీయమని అన్నారు. కరోనా మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడాలని ఇండియా దృఢ నిశ్చయంతో ఉందని ప్రధాని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 31 వరకు అన్ని రైళ్లను నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. కరోనా వైరస్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో పూర్తిగా మార్చి 31 వరకు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 
 
ముఖ్యంగా కరోనా కేసులు నమోదైన 75 జిల్లాల్లో మెట్రో రైళ్లు, బస్సు సదుపాయాలను పూర్తిగా నిలిపివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అలాగే రాష్ట్రాల మధ్య కూడా రవాణాను 31 వరకు నిలిపివేయడం మంచిదని కేంద్రం భావిస్తోంది. దీనికి కూడా రాష్ట్రాలు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.