లూధియానాలో ఘోరం.. చాక్లెట్లు ఆశచూపి 8 ఏళ్ల బాలికపై అత్యాచారం
దేశంలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పంజాబ్‌లోని లూధియానా నగరంలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. చాక్లెట్లు ఆశచూపి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్దార్థ నగర్‌కు చెందిన విశ్వకర్మ (25) అనే యువకుడు లూధియానాకు వలస వచ్చి కొంతకాలంగా సబ్జీమండి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.
తన ఇంటికి పొరుగునే ఉన్న ఎనిమిదేళ్ల బాలికపై అతడి కన్నుపడింది. గురువారం బాలికకు చాకెట్లతోపాటు రూ.50 ఆశచూపి తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురును వెతుకుతూ తల్లి వెళ్లగా గదిలో నగ్నంగా ఉన్న యువకుడు ఆమెను నెట్టేసి పరారయ్యాడు.
బాలికకు తీవ్రరక్తస్రావం అవుతుండటంతో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 342, 376 సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు లూధియానా ఏసీపీ గుర్బీందర్ సింగ్ తెలిపారు.