శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (16:53 IST)

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన పరిణీతి చోప్రా రాఘవ్ చద్దా

parineeti - raghav
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో పంజాబీ సంప్రదాయం ప్రకారం ఆదివారం అంరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంలతో పాటు బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్ ముఖ్య నేతలు హాజరయ్యారు. 
 
ఈ పెళ్లి ఫొటోలను కొత్త జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు రాఘవ్ - పరిణీతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థ వేడుక ఢిల్లీలోని రాజీవ్ చౌక్‌లో గల కపుర్తాల హౌస్‌లో గత నెల నెల 13వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. 
 
ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చాలారోజులు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. ఓ హోటల్ డిన్నర్ డేట్‌కు వచ్చిన సమయంలో ఇద్దరు ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా చదివారు. కామన్ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగి.. అది కాస్త ప్రేమగా మారింది. చివరకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.