శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 మే 2021 (13:14 IST)

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం : పార్లమెంట్ రద్దు

నేపాల్‌లో మరోమారు రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో పార్లమెంట్‌ను రద్దు అయింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ప్రకటించారు. ప్రధాని కేపీ శర్మ ఓలి కానీ, ఇటు ప్రతిపక్ష కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో బిద్యాదేవి ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది నవంబరు 12, 19వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, నేపాల్ పార్లమెంటు రద్దు కావడం ఐదు నెలల్లో ఇది రెండోసారి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యక్షురాలు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. 
 
ప్రధాని కేపీశర్మ ఓలి కానీ, ప్రతిపక్ష నేత షేర్ బహదూర్ దేవ్‌బా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందు రాలేదు. దీంతో గురువారం అర్థరాత్రి అత్యవసరంగా సమావేశమైన కేబినెట్ పార్లమెంటును రద్దు చేయాలని ప్రతిపాదించింది. పార్లమెంటును రద్దు చేసిన బిద్యాదేవి నవంబరు 12న తొలి దశ, 19న రెండో విడత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. 
 
కాగా, పార్లమెంటును రద్దు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఓలీ-భండారీ ద్వయం నిరంకుశ, ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని నిర్ణయించాయి. అధ్యక్షురాలి నిర్ణయం ఏకపక్షమని ఆరోపించాయి.