శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (09:06 IST)

ఆలయాల్లో ప్రసాదాలు - భజనలకు నో చెప్పిన కేంద్రం!

ఈ నెల 8వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూతపడిన ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు తెరుచుకోనున్నాయి. మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ దేవాలయంలోనూ భగవంతుడికి ప్రసాదాలు సమర్పించడం, స్వీకరించడం, తీర్థం తీసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదని తేల్చింది. 
 
ఇదేసమయంలో అందరూ ఒక సమూహంగా ఏర్పడి ఆలయాల్లో భజనలు చేయడాన్ని కూడా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. భజన గీతాలను కేవలం రికార్డుల ద్వారా మైకుల నుంచి మాత్రమే వినిపించాలని ఆదేశించింది. దక్షిణాదిన శబరిమల, తిరుమల నుంచి ఉత్తరాదిన వైష్ణోదేవి ఆలయాల్లో లాక్ డౌన్ ప్రారంభం నుంచి భక్తులను అనుమతించని సంగతి తెలిసిందే. 
 
దాదాపు రెండు రోజులుగా దేవాలయాల్లో అర్చకులు మాత్రమే పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. 8 తర్వాత దేవాలయాలు తెరిచేందుకు అనుమతి రావడంతో, ఇప్పటికే చాలా ప్రముఖ ఆలయాలు ఏర్పాట్లను పూర్తి చేయగా, మరికొన్ని మరింత స్పష్టమైన విధి విధానాల కోసం వేచి చూస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో గురువారం కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. దేవాలయాలు భక్తులు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు విడివిడిగా ద్వారాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒక్కొక్కరి మధ్యా కనీసం 6 అడుగుల దూరం తప్పనిసరిగా ఉండాలని సూచించింది. ఆలయంలోకి వెళ్లే ముందు భక్తులు విధిగా చేతులను, కాళ్లను సబ్బుతో కడుక్కోవాలని, ప్రార్థనా స్థలాల్లో భక్తులు కూర్చునే చాపలను ఎవరికి వారే తెచ్చుకోవాలని పేర్కొంది. దేవతా విగ్రహాలు, అక్కడి గోడలపై ఉండే శిల్పాలను తాకేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.