తలరాతను మార్చే బ్రహ్మదేవుని ఆలయం ఎక్కడుందో తెలుసా?
''సృష్టి''ని పరమేశ్వరుని నుంచి పొందిన బ్రహ్మదేవుడు.. లోకంలో పలు జీవులను సృష్టించే సత్తా తనకుందని విర్రవీగేవాడు. తాను కూడా శివునికి సమానమైన వాడినని గర్వపడేవాడు. అహం బ్రహ్మదేవుడిని ఆవహించింది. అయితే బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పాలని భావించిన మహాదేవుడు ఆయన ఐదు శిరస్సుల్లోని ఒకటిని తుంచివేస్తాడు.
ఇంకా సృష్టి ప్రక్రియను బ్రహ్మదేవుడి నుంచి తీసుకున్నారు. ఫలితంగా తన తప్పును తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఈశ్వరుని ప్రార్థించి క్షమాపణలు కోరాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడిని పరమేశ్వరుడు భూలోకంలో శివలింగాన్ని ప్రతిష్టించి.. స్తుతించాలని.. సరైన సమయంలో సృష్టికర్తగా మారుతావని అభయమిస్తాడు.
పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు భూలోకంలో అక్కడక్కడ శివలింగాలను ప్రతిష్టించి.. శివునిని ఆరాధించాడు. చివరిగా తమిళనాడులోని తిరుపట్టూరు అనే ప్రాంతానికి చేరుకుని 12 శివలింగాలను ప్రతిష్టించి.. మహాదేవుడిని నిష్ఠతో పూజించాడు. బ్రహ్మదేవుని భక్తిని మెచ్చిన ఈశ్వరుడు.. ఆయనను తిరిగి సృష్టికర్తను చేశాడు.
అలా బ్రహ్మదేవుడు ప్రార్థించిన, ప్రతిష్టించిన తిరుపట్టూరులోని ఈశ్వరునికి ''బ్రహ్మపురీశ్వరుడు'' అనే పేరు సార్థకమైంది. ఇది శివాలయంగా ప్రశస్తి చెందినా... ఇక్కడ బ్రహ్మదేవుడు బ్రహ్మాండంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. గురు పరిహార స్థలంగా నిలిచిన ఈ ఆలయంలో మూల విరాట్టుకు ఉత్తరం వైపు ప్రత్యేక సన్నిధిలో ఆరు అడుగుల ఎత్తులో ధ్యానస్థితిలో బ్రహ్మదేవుడు వేంచేసియున్నాడు.
Brahmmapureeswarar Temple
గురు భగవానుడికి బ్రహ్మదేవుడు అధిదేవత కావడంతో.. ఈ ఆలయంలోని బ్రహ్మదేవునికి గురువారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అందుకే ఏడో సంఖ్య ఆధిక్యంలో పుట్టిన వారు ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి.
బ్రహ్మదేవుడు ఈ ఆలయంలో వేంచేసినా.. ఈ ఆలయంలోని శివుడిని పూజించిన వారికి సకల దోషాలు తొలగిపోతాయి. ఈ ఆలయంలోనే బ్రహ్మదేవుడి తలరాతే మారింది కావున.. ఈ స్థలంలోని శివుడిని దర్శించుకుని నిష్ఠతో పూజించే వారికి తలరాతే మారిపోతుందని స్థలపురాణం చెప్తోంది.