దేశంలో సంపూర్ణ లాక్డౌన్ విధించం : నిర్మలా సీతారామన్
దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి కోసం పెద్ద ఎత్తున లాక్డౌన్ విధించమని, స్థానిక నియంత్రణ చేపడతామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్‌పాస్‌తో జరిగిన వర్చవల్ సమావేశంలో భారతదేశానికి రుణం పెంచడానికి ప్రపంచబ్యాంకు చేపట్టిన చర్యలను కేంద్రమంత్రి సీతారామన్ ప్రశంసించారు.
టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకాలు, కరోనా మార్గదర్శకాల అమలులాంటి ఐదు స్తంభాల వ్యూహంతో కరోనాను కట్టడి చేస్తామని సీతారామన్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించకుండా, స్థానికంగా కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ ఉండదని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కరోనా రోగులను ఇళ్లలో క్వారంటైన్ చేస్తామని చెప్పారు
కాగా, దేశంలో కరోనా కేసుల విజృంభణ మామూలుగా లేదు. నిన్న కొత్తగా 1,84,372 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 82,339 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,73,825 కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 1,027 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,72,085 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,23,36,036 మంది కోలుకున్నారు. 13,65,704 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 11,11,79,578 మందికి వ్యాక్సిన్లు వేశారు.