బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (11:02 IST)

భారత జవాన్లకు చైనా రక్షణ కిట్లు అవసరమా? నీతి ఆయోగ్ సభ్యుడి ప్రశ్న?

భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు నెలకొనివున్నాయి. లడఖ్ సమీపంలోని గాల్వాన్ లోయలో చైనా సైనికులు దురాగత చర్యల వల్ల 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశీయంగా చైనా పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా కంపెనీలు తయారు చేసిన రక్షణ కిట్లు భారత సైనికులకు అవసరమా అంటూ నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ ప్రశ్నించారు. 
 
ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా ఉన్నపుడు భారత రక్షణ శాఖ రెండు లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను చైనా సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. రక్షణ దళాలకు ఉన్న తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, లేహ్ సహా పలు సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో విధులను నిర్వహించే వారికి వీటిని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 
 
2017లో ఇందుకు సంబంధించిన డీల్ కుదరగా, అతి త్వరలోనే 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇండియాకు రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అందించే రక్షణ కిట్ల కాంట్రాక్టు విషయంలో మరోసారి ఆలోచించాలని నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) మాజీ చీఫ్ వీకే సారస్వత్ కోరారని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.