ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated: ఆదివారం, 2 అక్టోబరు 2022 (09:51 IST)

అక్టోబరు 2 గాంధీ పుట్టినరోజు మాత్రమే కాదు.. ఎన్నో ప్రత్యేకతలున్నాయి..

gandhi
ప్రతి యేటా అక్టోబరు రెండో తేదీని గాంధీ జయంతిగా జరుపుకుంటారు. ఆ మహనీయుడి జయంతి రోజుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అక్టోబరు రెండునే అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని పాటిస్తారు. గత 2007 నుంచి ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. 
 
జాతిపిత జయంతినాడే మచ్చలేని నాయకుడు, భారత తొలి రైల్వేమంత్రి, దేశ రెండో ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి కూడా. ఈ ఇద్దరు మహనీయులు జన్మించిన సంవత్సరాలు వేరైనా తేదీలు ఒకటే కావడం విశేషం. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటాయి. 
 
ఇక స్వాతంత్య్రోద్యమ చరిత్రలో విదేశీ వస్తు బహిష్కరణ కీలక పాత్ర పోషించింది. గాంధీజీ పిలుపు మేరకు భారతీయులు ఖాదీ దుస్తులు ధరించి స్వాతంత్య్ర సంగ్రామానికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహాత్ముడి జయంతిని 'జాతీయ ఖాదీ దినోత్సవం'గా నిర్వహిస్తున్నారు. 
 
ఇదే రోజును మాదకద్రవ్య వినిమయ వ్యతిరేక దినంగానూ జరుపుకుంటారు. అక్టోబరు 2 నుంచి 8వ తేదీ వరకు దాన్‌ ఉత్సవ్‌ (జాయ్‌ ఆఫ్‌ గివింగ్‌) వారంగా పిలుస్తారు. లేనివాళ్లకు తోచినంత దానం చేయడమే ఈ ఉత్సవ సందేశం. దాతృత్వం గొప్పదనాన్ని తెలియజేయాలనే సంకల్పంతో 2009లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.