ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (15:14 IST)

మా నివాసానికి ప్రధాని మోడీ రావడంలో తప్పులేదు : సీజేఐ చంద్రచూడ్

DY Chandrachud
తమ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడంలో ఎలాంటి తప్పుగానీ వివాదంగానీ లేదని సుప్రీంకోర్టు డీవై చంద్రచూడ్ మరోమారు స్పష్టం చేశారు. వినాయక చవితి సందర్భంగా సీజేఏ డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణేశ్ పూజకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హజరు కావడంపై తీవ్ర రాజకీయ దుమారం రేగిన విషయం విదితమే. 
 
సీజేఐ నివాసంలో జరిగిన గణేశ్ పూజలో ప్రధాని నరేంద్ర మోడీ హజరుకావడంపై ప్రతిపక్ష పార్టీలు, మేధావులు ఆక్షేపిస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో వారి మధ్య భేటీ వివాదాస్పదం అయ్యింది. ఈ వివాదంపై మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ అవుతున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మరోసారి స్పందించారు.
 
గతంలో ఓసారి స్పందిస్తూ, పలు సందర్భాల్లో ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులు కలుస్తుంటారని, అలానే ప్రధాన మంత్రులు, సూప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కలుస్తుంటారని, అయితే ఆ భేటీల్లో న్యాయపరమైన విషయాలే ఏవీ చర్చించబోమన్నారు. తాను గతంలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో తాను ముఖ్యమంత్రితో, ముఖ్యమంత్రి తనతో సమావేశం అవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు క్రమం తప్పకుండా సమావేశాలు కావడం ఒక ఆనవాయితీగా వస్తుందని ఆయన గుర్తు చేశారు. 
 
తాజాగా ఈ వివాదంపై మరోమారు సీజే స్పందించారు. ప్రముఖ ఆంగ్లపత్రిక ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీజే చంద్రచూడ్ వివిధ అంశాలపై మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ తమ నివాసానికి రావడంపైనా మరోసారి వివరణ ఇచ్చారు. తన నివాసానికి ప్రధాన మంత్రి రావడంలో తప్పులేదని స్పష్టం చేశారు. అది బహిరంగ భేటీయేనని, వ్యక్తిగత సమావేశం కాదన్నారు.