మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (15:11 IST)

కరోనా బాధితులకు వరుసబెడుతున్న రోగాలు... కొత్తగా పేగుల్లో గ్యాంగ్రీన్

కరోనా వైరస్ బారినపడిన కోలుకున్న బాధితుల్లో చాలా మంది ఇతర అనారోగ్య సమస్యలబారినపడుతున్నారు. ఇప్పటికే బ్లాక్ ఫంగస్, స్కిన్ బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, శరీర అవయవాలు, గుండె, మెదడులో రక్తం గడ్డకట్టిన ఘటనలు వెలుగు చూశాయి. వీటితో ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా పేగుల్లో గ్యాంగ్రీన్ కూడా వస్తున్నట్టు తేలింది. ఈ తరహా తొలి కేసును ముంబైలో గుర్తించారు. 
 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఇప్పుడు ఈ కేసులు ఎక్కువైపోయినట్టు సమాచారం. అయితే, ఇప్పటిదాకా కేవలం ఓ డజను కేసుల గురించే వైద్యులు బయటకు వెల్లడించారు. ఎవరైనా కరోనాతో కోలుకున్నాక భరించలేని నొప్పులు, కడుపునొప్పి వంటివి వస్తే అస్సలు ఆలస్యం చేయొద్దని సూచిస్తున్నారు.
 
ఈ మధ్యే ముంబైలోని హోలీ స్పిరిట్ ఆసుపత్రిలో పనిచేసే సునీల్ గవాలీ అనే వ్యక్తికి ఇదే సమస్య వచ్చిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అప్పటికే అతడిలో పేగులోని గడ్డ కాస్తా గ్యాంగ్రీన్‌గా మారిపోయిందని, వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. అతడికి సీటీ స్కాన్ చేయగా.. పేగులకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టినట్టు నిర్ధారించారు.
 
ఇప్పటిదాకా ఆ ఆసుపత్రిలో ఇలాంటి కేసులు 8 నుంచి 9 దాకా వచ్చాయని చెబుతున్నారు. ఫోర్టిస్ అండ్ జూపిటర్ ఆసుపత్రికీ ఐదు కేసులొచ్చాయి. అక్కడ ఒకరు ఆ సమస్యతో చనిపోయారు. మరో ఇద్దరికి శస్త్రచికిత్సలు చేసి గ్యాంగ్రీన్ ను తొలగించారు. కాగా, గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో ఇలాంటి కేసులు వంద వరకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.