మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (19:40 IST)

ఒక వ్యక్తి.. ఒకే పోస్టు : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్య

rahul gandhi
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే జరుగనుంది. ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదలకాగా, అక్టోబరు 17వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిర్ణయానికి కట్టుబడివుండాల్సిందేనని స్పష్టం చేశారు. 
 
కేరళలో కొనసాగుతోన్న భారత్‌ జోడో యాత్రలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీలో ఒకవ్యక్తి-ఒకే పదవిపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి అనేది కేవలం ఓ సంస్థకు సంబంధించిన స్థానం కాదు. అదొక సిద్ధాంతపరమైన స్థాయి, విశ్వసనీయ వ్యవస్థ. పార్టీలో పదవులపై ఉదయ్‌పుర్‌లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు. 
 
సీఎం పదవితోపాటు ఎన్నికల్లో గెలిస్తే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపడతానంటూ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ చెబుతోన్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ విధంగా స్పందించారు. పార్టీ బాధ్యతలు ఎవరు చేపట్టినా సరే.. అభిప్రాయాల సమూహం, విశ్వసనీయ వ్యవస్థ, దేశపు దార్శనికతను ఆ పదవి తెలియజేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.