సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఐకమత్యమే మహాబలం - అదే లక్ష్యాల చేరువకు సోపానం : ప్రధాని మోడీ

దేశ మొదటి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘ఏక్‌ భారత్‌ - శ్రేష్ఠ్‌ భారత్‌’ కోసం పటేల్‌ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. భారత్‌ బలంగా ఉండాలని ఆకాంక్షించారని చెప్పారు. 
 
వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పటేల్‌ స్ఫూర్తితోనే దేశం ఇప్పుడు అన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నదన్నారు. మనం ఐక్యంగా ఉంటేనే లక్ష్యాలను చేరుకోగలుగుతామన్నారు. దేశం మొత్తం ఆయనకు ఈరోజు నివాళులు అర్పిస్తుందని తెలిపారు.
 
భారతదేశం అంటే కేవలం భౌగోళిక ప్రాంతం కాదని.. ఎన్నో ఆదర్శాలు, నాగరికత, సంస్కృతికి ప్రతిరూపమని ప్రధాని అన్నారు. 135 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని చెప్పారు. దేశప్రజలంతా ఐక్యంగా ఉంటేనే.. దేశం తన లక్ష్యాలను సాధించగలుగుతుందన్నారు. 
 
భారతీయ సమాజం, సంస్కృతి నుంచే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది పడిందన్నారు. గత ఏడేండ్లలో పనికిరాని చట్టాలను తొలగించామని వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో దేశంలోని భౌగోళిక ప్రాంతాల మధ్య దూరం తగ్గుతున్నదన్నారు. 
 
అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా నివాళులర్పించారు. గుజరాత్‌లోని కెవాడియాలో ఉన్న ఐక్యతా విగ్రహానికి నివాళులర్పించారు. జాతీయ ఐక్యత దినోత్సవానికి ప్రాముఖ్యత ఉందన్నారు. స్వాతంత్య్రం తర్వాత బ్రిటీషర్లు దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించారని, వారి కుట్రను సర్దార్‌ పటేల్‌ భగ్నం చేశారని గుర్తుచేశారు.