గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (15:53 IST)

మమ్మల్ని గెలిపిస్తే బీజేపీకి ప్రజలే హైకమాండ్ : నరేంద్ర మోడీ

త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మొన్నటికిమొన్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించిన ఆయన.. గురువారం పుదుచ్చేరికి వచ్చారు. 
 
ముందుగా పుదుచ్చేరిలో జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఖేలో ఇండియా స్కీమ్‌లో భాగంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో‌ అథ్లెటిక్ ట్రాక్, సాగర్ మాల పథకంలో భాగంగా పుదుచ్చేరి పోర్ట్ డెవలప్‌మెంట్, 56 కిలోమీటర్ల మేర ఎన్45ఏ విస్తరణకు ప్రధాని శంకుస్థాపన చేశారు. బాలికా క్రీడాకారుల కోసం వంద పడకల బాలికా వసతి గృహాన్ని ప్రారంభించారు.
 
ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్రంలో మత్స్యు శాఖ లేదని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని కౌంటరిచ్చారు. 2019లోనే కేంద్ర ప్రభుత్వం మత్స్య శాఖ ఏర్పాటు చేసిందన్న విషయం కూడా రాహుల్‌కు తెలియకపోవడం షాక్ కు గురిచేసిందన్నారు.
 
'కేంద్రంలో మత్స్య శాఖ లేదని, దాని కోసం ఓ శాఖను ఏర్పాటు చేయాలని రాహుల్ చెప్పడంతో షాక్ అయ్యా. నిజానికి కేంద్రంలో మత్స్య శాఖ అనేది ఒకటుంది. 2019లోనే ఆ శాఖను ఏర్పాటు చేసింది కూడా మేమే' అని ఆయన అన్నారు. 
 
బ్రిటీష్ వారు మన దేశాన్ని ఆక్రమించి ‘విభజించు-పాలించు’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించిందని, కాంగ్రెస్ విధానం కూడా అదేనని అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీది ‘విభజించు-అబద్ధమాడు-పాలించు’ సిద్ధాంతమన్నారు. 
 
అందులోని కొందరు నేతలు సందర్భానికి తగ్గట్టు ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. పుదుచ్చేరికి ‘హై కమాండ్’ పాలన అవసరం లేదన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలకే లాభం కలిగేలా హైకమాండ్‌కు తలూపుతున్నారని వ్యాఖ్యానించారు. కానీ, బీజేపీకి ప్రజలే హైకమాండ్ అని అన్నారు. అందుకే బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.