ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజండరీ నటుడు...
ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొనియాడారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. ఆయన మృతి తనను ఎంతో ఆవేదనకు గురి చేస్తుందన్నారు.
ఇదే విషయంపై ప్రధాని మోడీ విడుదల చేసిన సంతాప సందేశంలో "కృష్ణగారు తన అద్భుత నటా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజండరీ సూపర్ స్టార్. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. ఈ విషాదకర సమయంలో మహేశ్ బాబుకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి'' అంటూ పేర్కొన్నారు.
అలాగే రాహుల్ గాంధీ స్పందిస్తూ, "తెలుగు సినిమా సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణగారు మరణించారనే వార్తతో చాలా ఆవేదనకు గురయ్యానని చెప్పారు. ప్రజా జీవితంలో ఎలా ఉండాలనే దానికి ఆయన వృత్తిపరమైన క్రమశిక్షణ, విలువలు ఒక ఉదాహరణంగా నిలిచిపోతాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.