గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (15:05 IST)

సుదర్శన చక్రం ధరించి శత్రుసంహారం చేస్తాం : ప్రధాని మోడీ

లడఖ్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ భారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మనం బలహీనులం ఎంత మాత్రం కాదన్నారు. వేణుగానంతో ఓలలాడించిన శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తాం. అదేసమయంలో సుదర్శన చక్రం ధరించి శత్రుసంహారం చేసిన శ్రీకృష్ణుడిని కూడా ఆరాధిస్తాం అంటూ శత్రుదేశాలకు పరోక్ష హెచ్చరికలు చేశారు. 
 
తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా సైనికులు జరిపిన దొంగదెబ్బ కారణంగా 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఇండో - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా లడఖ్‌లో పర్యటించారు. 
 
ఆ తర్వాత ఆయన సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సైనికులు దేశ సరిహద్దుల్లో ఉండటం వల్లే దేశం మొత్తం నిశ్చింతగా ఉందన్నారు. వేల సంవత్సరాలుగా భారత్ అనేక దాడులను తిప్పికొట్టిందని, ఇవాళ భారత్ శక్తి, సామర్థ్యాలు అజేయం అని వ్యాఖ్యానించారు. ప్రపంచం మొత్తానికి భారత్ శక్తి సామర్థ్యాలు నిరూపించామన్నారు. భారత త్రివిధ దళాలు అత్యంత శక్తిమంతం అని వ్యాఖ్యానించారు. 
 
లేహ్, లడఖ్, కార్గిల్, సియాచిన్, గాల్వన్ ఎక్కడైనా మన సైనికుల పరాక్రమం నిరూపితమైందని తెలిపారు. ఇవాళ దేశ ప్రజలందరి ఆశీస్సులు సైన్యానికి ఉన్నాయన్నారు. బలహీనులు శాంతి పొందలేరని, వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
 
'మనం బలహీనులం కాదు. వేణుగానంతో ఓలలాడించిన శ్రీకృష్ణుడ్ని ప్రార్థిస్తాం, అదేసమయంలో సుదర్శన చక్రం ధరించి శత్రుసంహారం చేసిన శ్రీకృష్ణుడ్ని కూడా ఆరాధిస్తాం. భారతమాత శత్రువులకు ఇప్పటికే ఆవేశాగ్ని రుచిచూపించారు. మీ సంకల్ప శక్తి హిమాలయాల అంతటి సమున్నతమైంది. యావత్ జాతి మిమ్మల్ని చూసి గర్విస్తోంది' అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. 
 
అంతకుముందు.. ఆయన తూర్పు లడఖ్‌లోని నిము ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆర్మీ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితులను ప్రధానికి ఉన్నతాధికారులు వివరించి చెప్పారు. లడఖ్‌లో తీసుకుంటోన్న చర్యల గురించి మోదీకి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే తెలిపారు.
 
ఆర్మీకి పలు సూచనలు చేసిన మోడీ అనంతరం సైనికుల వద్దకు మరోసారి వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మోడీ పర్యటన సందర్భంగా సైనికులు భారత్‌ మాతా కీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.