ఉగ్రదాడికి పాల్పడిన వారికి.. కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదు : ప్రధాని మోడీ హెచ్చరిక
పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారికి, వారి వెనుక ఉన్న కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు హెచ్చరించారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి భారతదేశ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నట్టు తెలిపారు. దీని వెనుక ఉన్న కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. బాధితుల కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు.
ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం అయిన మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్‌లో జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడుని కలిచివేసిందన్నారు. 'ఈ రోజు మీతో నా మనసులోని మాటను పంచుకుంటున్నన వేళ, నా హృదయం తీవ్ర వేదనతో నిండివుంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్ని గాయపరిచింది. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడు తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడే వారైనా ఈ దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నాను' అని పేర్కొన్నారు.