పోలీసులకు బాగా మందు పోసి, అక్కడి నుండి పరారైన ఖైదీ..
చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం గుర్తుందా? ఆ చిత్రంలో హీరో పోలీస్ స్టేషన్‌లో పోలీసులను చితక్కొట్టి బయటకు వస్తాడు. ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. అయితే ఇప్పుడు ఓ ఖైదీ పోలీసులకు మందు తాగించి అక్కడి నుండి పరారైయ్యాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ ఖైదీ పోలీసుల బంధీ నుండి చాలా తెలివిగా పరార్ అయ్యాడు. సదరు ఖైదీ ఓ లాయర్ హత్య కేసు, దోపిడీ కేసుతో పాటు మొత్తం పది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడే గ్యాంగ్‌స్టర్ బద్దాన్ సింగ్. తాజాగా ఇతడు పోలీసుల కస్టడీ నుండి జంప్ అయ్యాడు. 1996 సంవత్సరంలో ఓ లాయర్‌ను హత్య కేసులో బద్దాన్ సింగ్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
కాగా ఫతేఘర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బద్దాన్‌ను ఓ కేసు విచారణ విషయంలో గజియాబాద్‌కి తరలించడానికి పోలీసులు ఏర్పాటు చేసారు. అయితే బద్దాన్ మాత్రం వారికి మందు దావత్ ఏర్పాటు చేసానని ఎస్కార్టుగా వచ్చిన పోలీసులను నమ్మించి మీరట్‌లోని ఓ హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ బద్దాన్ తన అనుచరులతో పోలీసులకు మందు దావత్ ఏర్పాటు చేసారు.
ఇక పోలీసులు అదే అదునుగా ఫుల్లుగా తాగి ఉండడం చూసిన బద్దాన్ అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. కాగా ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఏడుగురిలో ఓ ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నాడు.