850 మంది భారతీయ ఖైదీల విడుదల....
సౌదీ జైళ్ళ నుంచి 850 మంది భారతీయ ఖైదీలకు విముక్తి లభించనుంది. ప్రస్తుతం సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. ఇందుకోసం ప్రధాని తన ప్రొటొకాల్‌ను సైతం పక్కనపెట్టేశారు.
ఆ తర్వాత సౌదీ యువరాజు, ప్రధానమంత్రిలు ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా, సౌదీలో వివిధ జైళ్ళలో మగ్గుతున్న ఏకంగా 850 మంది ఖైదీలను విడుదల చేయాల్సిందిగా మోడీ కోరడం, దానికి సౌదీ యువరాజు సమ్మతించడం జరిగింది.
అలాగే, ఇప్పటివరకు లక్షా 75 వేలుగా ఉన్న భారత్ హజ్ యాత్రికుల కోటా సంఖ్యను రెండు లక్షలకు పెంచుతున్నట్టు కూడా తెలిపారు. కాగా, భారత్ పర్యటనకు ముందు పాకిస్థాన్‌లో పర్యటించిన సౌదీ యువరాజు.. పాకిస్థాన్‌కు చెందిన 2000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే.