లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)
లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రవర్తనపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీలంతా సభా మర్యాదలను పాటించాల్సిందేనని అన్నారు. బుధవారం నాడు సభ జరుగుతున్న సమయంలో తన సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వద్దకు వచ్చిన రాహుల్ గాంధీ ఆమె బుగ్గలు నిమిరి పలుకరించారు. దీన్ని చూసిన స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ్యులందరికీ కీలక సూచనలు చేశారు.
"సభలో ఎలా ప్రవర్తించాలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. తల్లీకూతుళ్లు, తండ్రీకూతుళ్లు, భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్లు అయినప్పటికీ తప్పకుండా అందరూ సభ నియమాలు పాటించాలి" అని ఓం బిర్లా పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.