బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (10:40 IST)

సీఎం పళనిస్వామి సర్కారును గట్టెక్కించిన తమిళనాడు స్పీకర్...

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. అధికారం కోసం జరుగుతున్న కుమ్ములాటలో దినకరన్ వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది.

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. అధికారం కోసం జరుగుతున్న కుమ్ములాటలో దినకరన్ వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. పార్టీ విప్‌ను ధిక్కరించారని 18మంది ఎమ్మెల్యేలను అనర్హుల్ని చేస్తూ శాసనసభ స్పీకర్ ధన్‌పాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారును గట్టెక్కించినట్టేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 మంది సభ్యులుండగా బలపరీక్ష నిర్వహిస్తే, పళనిస్వామి ప్రభుత్వానికి 117 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ, అంత బలం అన్నాడీఎంకేలోని పళని - పన్నీర్ వర్గానికి లేదు. ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో అసెంబ్లీలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 234 నుంచి 216కు చేరింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గం ఆర్కేనగర్ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. 
 
దీంతో పళనిస్వామి అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గాలంటే 107 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. ఇది పళనిస్వామి ప్రభుత్వం నెత్తిన పాలుపోసినట్లే. అనర్హత వేటు తర్వాత అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 116 మంది ఎమ్మెల్యేలుండగా, డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్‌కు 8 మంది సభ్యులు, ఐయూఎంఎల్ సభ్యుడు ఒకరు ఉన్నారు. దీంతో అసెంబ్లీలో బలపరీక్ష జరిగినా పళనిస్వామి ప్రభుత్వం గట్టెక్కినట్టే.