శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (08:20 IST)

శబరిమలకు 20 రోజుల్లోనే రికార్డ్​ స్థాయి ఆదాయం

శబరిమల యాత్ర ప్రారంభమైన తొలి 20 రోజుల్లోనే అయ్యప్పకు రికార్డు స్థాయిలో రూ.69.39 కోట్ల ఆదాయం దక్కింది. మరో 60 రోజులపాటు యాత్ర కొనసాగనున్న నేపథ్యంలో ఆదాయం రికార్డు స్థాయిని దాటిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

శబరిమలకు భక్తుల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో ఆలయ ఆదాయమూ అదే స్థాయిలో పెరుగుతోంది. మొదటి 20 రోజుల్లోనే రూ. 69 కోట్లు దాటింది. మరో 60 రోజుల పాటు శబరిమలను దర్శించుకునేందుకు అయ్యప్ప భక్తులు రానున్నారు. మొదటి 20 రోజుల్లోనే భారీగా ఆదాయం సమకూరినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.

ఇది గతేడాదితో పోలిస్తే రూ. 27.55 కోట్లు ఎక్కువ. అరవణ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 28.26 కోట్లు, అప్పం ప్రసాదం ద్వారా రూ. 4.2 కోట్లు, హుండీ ద్వారా రూ. 23.58 కోట్ల రూపాయలు లభించినట్లు బోర్డు తెలిపింది. అయితే గతేడాది ఇదే సమయానికి దేవస్థానానికి భక్తుల కానుకల రూపంలో చేరిన ఆదాయం రూ. 41.84 కోట్లుగా బోర్డు పేర్కొంది.

మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పిస్తూ గతేడాది సుప్రీం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వివాదం చెలరేగింది. ఆ కారణంగానే కిందటి ఏడాది ఆదాయం తగ్గినట్లు ఆలయ ధర్మకర్తలు వెల్లడించారు