శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (18:19 IST)

అయోధ్య వివాదం సమసిపోయినట్టేనా? సున్నీ వక్ప్ బోర్డు కీలక నిర్ణయం!

వివావాదాస్పద అయోధ్య కేసును పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పును దేశంలోని అన్ని సంఘాలతోపాటు.. వివిధ సంస్థలు, దేశ ప్రజలు ముక్తకంఠంతో స్వాగతించారు. పైగా, పలు ముస్లిం సంస్థలు, బోర్డులు కూడా సుప్రీం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశాయి. 
 
ఇటీవల ఎన్నో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న బాబ్రీ మసీదు - రామ జన్మభూమి వివాదం కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 9న తుది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి మొత్తాన్ని రామ్ లల్లాకి అప్పగించాలనీ... మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో 5 ఎకరాల భూమి కేటాయించాలని సుప్రీం ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయరాదని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు సున్నీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ జుఫర్ ఫరూఖి మంగళవారం వెల్లడించారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులకు గానూ ఏడుగురు సభ్యులు పాల్గొన్న బోర్డు కీలక సమావేశంలో... సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేయరాదని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మొత్తం ఆరుగురు సభ్యులు రివ్యూ పిటిషన్ వేయరాదన్న అభిప్రాయాన్ని వెల్లడించారని ఫరూఖీ వెల్లడించారు.
 
కాగా అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఐదు ఎకరాల భూమిని తీసుకోవాలా వద్దా అన్నది బోర్డు ఇంకా నిర్ణయించలేదని ఆయన తెలిపారు. ఈ అంశంపై మరింత సమయం అవసరమని, షరియత్ ప్రకారం ఇది సరైనదా అన్నది ఆలోచించాల్సి ఉందని సభ్యులు భావిస్తున్నట్టు ఫరూఖీ వెల్లడించారు.