27న శశికళ చెన్నైకి రావడంలేదు... ఎందుకో తెలుసా?
కరోనా బారిన పడి ఆస్పత్రి పాలైన అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ క్రమంగా కోలుకుంటున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం శశికళ ఈనెల 27వ తేదీన చెన్నై రావాల్సి వుంది. ఆమెకు వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి. కానీ ఈ స్వాగత ఏర్పాట్లను వాయిదా వేసుకున్నాయి.
శశికళ కోలుకున్న అనంతరం ఆమె 15 రోజుల పాటు క్వారంటైన్‌లో వుండాల్సి వుంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆమె చెన్నైకి రాలేరు. అందువల్ల బెంగుళూరులోనే ఏదో ఒక ఆస్పత్రిలో గానీ, లేదా ప్రత్యేక భవనంలో గానీ వుంటారని ఆమె బంధువులు చెబుతున్నారు.
అయితే ఆమె ఆరోగ్య దృష్ట్యా ప్రైవేటు ఆస్పత్రిలో వుంచుతామని వారు పేర్కొన్నారు. మరోవైపు ఆమె విడుదల కావాల్సిన రోజున జైలు అధికారులు ఆస్పత్రికి వచ్చి దస్త్రాలపై ఆమె వద్ద సంతకం తీసుకుంటారని తెలుస్తోంది.
ఇక శశికళ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని, అధికారులే ఆస్పత్రికి వచ్చి ఆమెకు సంబంధించిన వస్తువులు, జైలులో ఆమె చేసిన పనికి వచ్చిన జీతం చెక్కు తదితరాలను ఆమెకు అప్పగిస్తారని జైళ్లశాఖ వర్గాలు పేర్కొన్నారు.
అదేవిధంగా ఆమెకు పోలీసు భద్రత కూడా ఉపసంహరించుకుంటారు. అందువల్ల శశికళ అక్కడే వుండాలా, లేక వేరే ప్రాంతానికి వెళ్లాలా అన్నది ఆమె ఇష్టమే.