బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 జులై 2019 (18:15 IST)

షీలా దీక్షిత్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె... ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పంజాబ్ లోని కపుర్తలలో 1938 మార్చి 31న షీలా దీక్షిత్ జన్మించారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలను నిర్వహించారు. 
 
1998 నుంచి 2013 వరకు సీఎంగా వ్యవహరించారు. కేరళ గవర్నర్‌గా కూడా ఆమె పని చేశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. షీలా దీక్షిత్ ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్నారు. గతంలో లోక్ సభ అంచనాల కమిటీకి ఆమె సేవలందించారు.  ఆమె మరణం పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. షీలా దీక్షిత్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు.
 
అటు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా షీలా దీక్షిత్ మృతి పట్ల స్పందించారు. షీలా జీ మృతి వార్త వినాల్సి రావడం ఎంతో బాధాకరమైన విషయం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె ముద్దుబిడ్డ అని కీర్తించారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించి నిస్వార్థమైన రీతిలో ఢిల్లీకి సేవలు అందించారని కొనియాడారు. షీలా దీక్షిత్ కుటుంబసభ్యులకు, ఢిల్లీ ప్రజలకు సానుభూతి తెలిపారు.