శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (16:46 IST)

'మహా' సంగ్రామం.. రూ.10కే భోజనం... ఆసక్తి రేపుతున్న శివసేన మేనిఫెస్టో

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. అన్ని పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో శివసేన ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఇపుడు అమితాసక్తిని రేపుతోంది. ఈ మేనిఫెస్టో అత్యంత ఆకర్షణీయంగా రూపొందించింది. 
 
ఒక్క రూపాయికే వైద్య పరీక్షలు, పేదలకు అందుబాటులో వైద్యం, రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి భోజనాలయాలు, వాటిలో రూ.10కే భోజనం, 300 యూనిట్ల వరకు విద్యుత్ వాడకంపై 30 శాతం రాయితీ, మరాఠీలో 80 శాతం పైగా మార్కులు తెచ్చుకున్న 10, 12వ తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, రైతులకు ఏటా రూ.10 వేలు నగదు బదిలీ, యువతకు రూ.15 లక్షల వరకు ఆర్థికసాయం, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం కాలేజీల వరకు ప్రత్యేక బస్సులు వంటివి శివసేన మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
 
ఇవేకాకుండా రైతులకు ఊరట కలిగించేలా ఐదేళ్లపాటు ఎరువులు, పురుగుమందుల ధరల్లో ఎలాంటి మార్పులు చేయబోరట. ఇప్పుడున్న ధరలనే వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇపుడు ఈ మేనిఫెస్టోనే అమితాకర్షణగా నిలిచి ఓటర్లను ఆకట్టుకుంటోంది.