శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

సియాచిన్ రియల్ హీరో నరేంద్ర కుమార్ ఇకలేరు...

సియాచిన్‌కు దారిచూపిన రియల్ హీరో కల్నల్ (రిటైర్డ్) నరేంద్ర కుమార్ ఇకలేరు. ఆయన 2020 సంవత్సరం ఆఖరి రోజైన డిసెంబరు 31వ తేదీన కన్నుమూశారు. ఆయన వయసు 87 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన పరిస్థితి విషమించి మరణించారని కుటుంబీకులు తెలిపారు.
 
భారత సరిహద్దుల్లో హిమాలయాల పర్వత సానువుల్లో అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉన్న సియాచిన్ పర్వతశ్రేణుల(గ్లేసియర్‌)కు తొలిసారిగా భారత సైన్యాన్ని తన వెంట తీసుకుని వెళ్ళారు. అందుకే ఆయన సియాచిన్ రియల్ హీరోగా గుర్తింపు పొందారు. 
 
భారత జవాన్లు తొలిసారిగా సియాచిన్‌కు వెళ్లారంటే, అందుకు కారణం నరేంద్ర కుమారే. 1933లో ప్రస్తుతం పాకిస్థాన్ పరిధిలో ఉన్న రావల్పిండిలో జన్మించిన నరేంద్ర కుమార్, పర్వతారోహణలో సిద్ధహస్తుడు. 
 
ఓ బృందాన్ని తీసుకుని ఏప్రిల్ 1984లో అత్యంత క్లిష్టమైన సియాచిన్ గ్లేసియర్‌కు చేరుకున్నారు. ఆయన సాహసం తదుపరి చేబట్టిన ఆపరేషన్ మేఘదూత్ విజయవంతం అయ్యేందుకు ఎంతో సహకరించింది.
 
ఆ తర్వాత సియాచిన్ గ్లేసియర్ పక్కనే ఉన్న మరో ఎత్తయిన ప్రాంతమైన సాల్టోరో ప్రాంతంపైనా భారత్ పట్టు సాధించింది. ఇంకా చెప్పాలంటే, సాల్టోరో రేంజ్ ఎవరి అధీనంలో ఉంటుందో, వారికే సియాచిన్‌పై పట్టు లభిస్తుంది. పశ్చిమాన పాకిస్థాన్, తూర్పున చైనా దేశాల సరిహద్దుల మధ్య ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం ఇండియా అధీనంలోనే ఉంది. దీనికి కారణం నరేంద్ర కుమార్ చలువే.
 
కాగా, సియాచిన్‌కు వెళ్లే ముందు 1978లో ప్రపంచంలోని మూడో అతిపెద్ద పర్వతమైన కాంచనగంగను నరేంద్ర కుమార్ అధిరోహించారు. ఆయన సాధించిన ఘనతలను భావి తరాలకు తెలిపేలా భారత ప్రభుత్వం ప్రత్యేక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. నరేంద్ర కుమార్ మృతిపట్ల పలువురు సైన్యాధికారులు, ప్రముఖులు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు.