ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (11:44 IST)

ఆటో, బైక్‌లను ఢీ కొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు.. ఆరుగురు మృతి

road accident
రాఖీ పండగ సందర్భంగా తమ సోదరుల ఇంటికి వెళ్లి తిరిగొస్తుండగా గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆటో, బైక్‌లను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు, బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో  ముగ్గురు మహిళలు ఉన్నారు.  
 
ప్రమాదానికి కారణమైన కారు కాంగ్రెస్ ఎమ్మెల్యే పూనంభాయ్ మాధాభాయ్ అల్లుడు ఖేతన్ పధియార్‌ది కావడం గమనార్హం. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హైవేపై అతివేగంతో దూసుకొచ్చిన కియా సెల్టోస్ ఎస్‌యూవీ ఒక ఆటోను, బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. 
 
మృతులను జియాబెన్ మిస్త్రీ, జాన్వీబెన్ మిస్త్రీ, వీణాబెన్ మిస్త్రీ, యాసన్ వోహ్రా, యోగేశ్, సందీప్‌లుగా గుర్తించారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు ఖేతన్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. 
 
ఈ ప్రమాద ఘటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రమాదానికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు ఖేతన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.