శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (15:45 IST)

రైతుల ఆందోళనల వెనుక పాక్ హస్తం... అయితే సర్జికల్ స్ట్రైక్స్ చేయండి...

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశంలోని రైతులంతా ఏకమై గత 15 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు రోజు రోజుకూ తీవ్రతరమవుతున్నాయి. రైతులు చేస్తున్న ఆందోళనల వెనుక పాకిస్థాన్ హస్తముందని కేంద్ర మంత్రి రావ్ సాహెబ్ దాన్వే అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నార్సీ, సీఏఏ విషయంలో ముస్లింలను కొందరు తప్పుదోవ పట్టించారని, ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదని అన్నారు. అచ్చు అలాగే రైతులను కూడా ఇప్పుడు కొందరు తప్పుడు ప్రచారాలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 
 
'ఇదేమీ రైతుల ఉద్యమం కాదు. వీటి వెనుక పాక్, చైనాలున్నాయి. ఎన్నార్సీ, సీఏఏ వస్తున్నాయ్. ఆరు నెలల్లోగా మిమ్మల్ని తరిమేస్తారు అని ముస్లింలను భయపెట్టారు. ఒక్క ముస్లింనైనా వెళ్లగొట్టామా? వారి ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. రైతుల విషయంలోనూ ప్రస్తుతం అలాంటి పుకార్లే చేస్తున్నారు' అని ధ్వజమెత్తారు. 
 
ఈ వ్యాఖ్యలను శివసేన తీవ్రంగా ఖండించింది. దీనిపై ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ, అదే నిజమైతే చైనా, పాకిస్థాన్‌లపై వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని అన్నారు. రైతుల ఆందోళనల వెనుక ఆ దేశాల హస్తం ఉందనే సమాచారం ఉన్నట్టైతే... ఆ దేశాలపై రక్షణ మంత్రి వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన విషయమని... రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, త్రివిధ దళాల అధిపతులు వెంటనే దీనిపై చర్చించాలని అన్నారు.