శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (22:32 IST)

'స్వచ్ఛమైన నగరాల' జాబితాలో ఏపీలోని ఆ మూడు ప్రాంతాలు!

దేశంలోని అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు పట్టణాలకు చోటు దక్కింది. అయితే, ఈ యేడాది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ పట్టణం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆతర్వాతి స్థానాల్లో సూరత్, ముంబైలు నిలిచాయి. కానీ, ఇండోర్ మాత్రం వరుసగా నాలుగోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. 
 
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ వెల్లడించిన 'స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్-2020' జాబితా మేరకు.. టాప్-10 స్థానాల జాబితాలో ఏపీలోని మూడు ప్రాంతాలకు చోటు దక్కింది. వాటిలో మొదటిది విజయవాడ కాగా, రెండోది విశాఖపట్టణం, మూడోది తిరుపతి పట్టణాలు ఉన్నాయి. 
 
దేశంలోనే ప‌రిశుభ్ర‌తగ‌ల న‌గ‌రంగా విజ‌య‌వాడ నాలుగో స్థానం ద‌క్కించుకుంది. తిరుప‌తి ఆరో ర్యాంకు, విశాఖ‌ప‌ట్నం తొమ్మిదో ర్యాంకు సాధించాయి. స్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించే పద్ధతిని 2016 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అపుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉన్నారు. 
 
కాగా, పరిశుభ్రతను పాటించే 129 అత్యుత్తమ నగరాలు, రాష్ట్రాలకు పురస్కారాలనిస్తారు. తొలి సంవత్సరం... దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా మైసూరు నిలిచింది. ఆ తర్వాతి ఏడాది ఇండోర్ నగరం ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. అప్పటి నుంచి ఇండోర్ వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలవడం విశేషం. 
 
కాగా... దేశంలో పరిశుభ్రమైన రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఆరో స్థానాన్ని ద‌క్కించుకోగా, తెలంగాణ కూడా టాప్ 10‌లో చోటు సంపాదించుకుంది. కాగా స్వచ్ఛ సర్వేక్షణ్‌కు ఎంపిక చేసే విధానాలకు సంబంధించి... రానున్న సంవత్సరాల్లో మరిన్ని ప్రామాణికాలను చేర్చే అవకాశాలున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.