శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 నవంబరు 2019 (13:44 IST)

దళిత యువకుడితో లేచిపోవాలనుకున్న కుమార్తె - కిరోసిన్ పోసి నిప్పంటించిన తల్లి

తమిళనాడు రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. అగ్రకులానికి చెందిన ఓ యువతి దళిత యువకుడుని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన పెద్దలు ప్రేమికులిద్దరినీ హెచ్చరించారు. అయినప్పటికీ ఆ యువతి మాత్రం అతనితో పారిపోవాలని ప్లాన్ చేసుకుంది. సమాచారం తెలుసుకున్న తల్లి కుమార్తె శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత వారు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగపట్టణం జిల్లా వాజ్‌మంగళం గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉమా మహేశ్వరి, కన్నన్‌ దంపతులకు జనని అనే 17 యేళ్ల కుమార్తె ఉంది. ఈమె ఇదే గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడిపై మనసు పారేసుకుంది. 
 
ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆ ప్రేమికులను హెచ్చరించారు. అంతేకాకుండా, తమ కుమార్తెకు 18 యేళ్లు నిండిన తర్వాత పెళ్లి చేయాలని ఉమామహేశ్వరి దంపతులు నిర్ణయించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న జనని ప్రేమించిన యువకుడితో లేచిపోయేందుకు నిర్ణయించుకుంది. ఇరుగుపొరుగువారి ద్వారా సమాచారం తెలుసుకున్న ఉమామహేశ్వరి ఆగ్రహంతో ఊగిపోయింది. కన్నబిడ్డ అని కూడా చూడకుండా జననిపై కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేసింది. 
 
ఆ తర్వాత తనపై కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో జనని ప్రాణాలు కోల్పోగా, మహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.