శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (10:10 IST)

భారతీయులపై మీ నిర్వచనం ఏమిటో చెప్పండి : కపిల్ సిబాల్ డిమాండ్

భారతీయులపై మీ నిర్వచనం ఏమిటో కనీసం ఇప్పుడైనా చెప్పాలని, లేదంటే మార్చి 24 వరకు జరిగిన పరిణామాలే మీ నిర్వచనంగా భావించాలా అని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ ప్రధాని మోడీని ప్రశ్నించారు.

మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై కాకుండా ప్రజలపై దృష్టి సారించి వుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. కరోనా విపత్తును ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం భౌతికదూరం పేరుతో ప్రజలకు దూరంగా ఉంటూ.. వారి సమస్యలు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

ముఖ్యంగా పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. చరిత్ర పుస్తకాల్లో ఈ ప్రభుత్వాన్ని చెడుకు సంకేతంగా పేర్కొంటారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కపిల్‌సిబాల్‌ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని ప్రధాని మోడీ ప్రగల్భాలు పలుకుతున్నారని, అయితే మార్చి 24 వరకు వారు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని దుయ్యబట్టారు.

మార్చి 24 వరకు మోడీ సర్కార్‌ ఆర్టికల 370, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, జాతీయ పౌరసత్వ నమోదు పట్టిక (ఎన్‌ఆర్‌సి), ట్రిపుల్‌ తలాక్‌లపై దృష్టిపెట్టిందని, విద్య, ఆరోగ్యం, పేదల సంరక్షణ, ఆందోళనలను పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి వుంటే ఈరోజు భారత్‌ భిన్నంగా ఉండేదని సిబాల్‌ పేర్కొన్నారు.