ఈ మాస్క్ ధర 5.70 లక్షలు!
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. దాంతో పలు కంపెనీలు పెద్ద ఎత్తున మాస్కులు తయారుచేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి.
ప్రస్తుతం కేసులు తక్కువగా నమోదవుతుండగా ప్రజలు శానిటైజర్ వాడకం తగ్గించినా 90 శాతం మంది మాస్కులను మాత్రం ధరిస్తున్నారు. కొంతమంది మాస్క్ ధరించడంలో తమ సృజనాత్మకత, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో వజ్రాలు, బంగారు ఆభరణాలతో తయారుచేసిన మాస్కుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ఆభరణాల వ్యాపారి బంగారంతో మాస్క్ తయారుచేశాడు. చందన్ దాస్ అనే వ్యాపారి సుమారు రూ.5.70లక్షలను ఖర్చుచేసి ఈ గోల్డెన్ మాస్క్‌ను రూపొందించాడు. సుమారు 108 గ్రాముల బరువున్న ఈ మాస్క్‌ను తయారుచేయడానికి అతనికి 15 రోజులు పట్టింది.
బంగారు ఆభరణాలు ధరించడమంటే ప్రత్యేక ఆసక్తి చూపే చందన్ పండగలు, పర్వదినాలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ మాస్క్‌ను ధరిస్తాడట. ఈ మాస్క్ ఫోటోను ఓ యువతి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి దీంతో ఏం ఉపయోగం అంటూ ప్రశ్నించింది. దాంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.