ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శనివారం, 23 ఫిబ్రవరి 2019 (18:30 IST)

టిక్ టాక్ పిచ్చి పీక్స్‌కి... రోడ్డుపై వేగంగా బైకుపై ముగ్గురు యువకులు...

ఇపుడు యువతీయువకుల్లో టిక్ టాక్ గేమ్ పిచ్చి పీక్స్‌కు వెళ్లిపోతోంది. వెర్రి వేషాలు వేస్తూ వాటిని వీడియోలుగా తీసి షేర్ చేస్తూ లైకులు, కామెంట్ల కోసం ఎగబడుతున్నారు. ఇందుకోసం వారు చేస్తున్న ఫీట్లు కొంతమంది ప్రాణాలను తీస్తున్నాయి. గతంలో బ్లూ వేల్ గేమ్ కూడా ఇలాగే ఎంతోమంది ప్రాణాలను లాగేసింది. తాజాగా ఆ స్థానంలో టిక్ టాక్ తిష్టవేసి కూర్చుందనే టాక్ వినబడుతోంది.
 
ఇప్పటికే ఈ టిక్ టాక్ గేమ్ కారణంగా పలువురు యువతీయువకులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. కొందరు పిచ్చివాళ్లుగా మారిపోయి మెంటల్ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకుంటున్నారు. ఇలాంటి వార్తలు ఎన్ని చూసినా ఈ గేమ్ ఆడుతున్నవారి సంఖ్య మాత్రం తగ్గటంలేదు. వారిస్తుంటే ఎదురుతిరిగుతున్న యువత సంఖ్య కూడా ఎక్కువగా వుంటోందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... తమిళనాడులో ముగ్గురు యువకులు టిక్‌టాక్‌లో వినూత్నంగా వీడియో చేద్దామనుకుని బైక్‌పై వేగంగా వెళ్లడం మొదలుపెట్టారు. విజ్ఞేష్‌, సూర్య, రైగాన్‌ అనే ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తూ వుండగా వెనుక కూర్చున్న ఓ యువకుడు తన సెల్ ఫోనులో వీడియో షూట్ చేస్తూ వున్నాడు. బండి నడుపుతున్న యువకుడు పట్టపగ్గాలు లేకుండా స్పీడుగా నడుపుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఇష్టం వచ్చినట్లు నడపుతున్నాడు.
 
ఈ క్రమంలో ఎన్నో వాహనాలను దాటుకుంటూ ఏదో పెద్ద విజయం సాధించినట్లు వెళ్తూ వున్నాడు. ఇలా వెళ్తుండగా అకస్మాత్తుగా అతడి వాహనానికి ఓ మినీ వాహనం అడ్డు వచ్చింది. దాన్ని తప్పించి మరింత వేగంగా దూసుకువెళ్తూ ముందు వెళుతున్న బస్సును తప్పించబోయి దాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. యువకులను ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో ఓ యువకుడి ప్రాణాలు పోయాయి. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు వైద్యులు చెప్పారు. 
 
ఇక వారు రికార్డ్ చేస్తున్న సెల్ ఫోన్ గిరగిరా తిరుగుతూ ఆకాశంలోకి వెళ్లి దబ్బుమంటూ కిందపడిపోయింది. ఐతే అందులో రికార్డయిన దృశ్యాలు ఇపుడు టిక్ టాక్ వీడియోల్లో దర్శనమిస్తున్నాయి. దీనిపై ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. ఇకనైనా ఈ డెత్ గేమ్ ను ఆడవద్దంటూ పలువురు సూచనలు చేస్తున్నార. టిక్ టాక్ గేమ్ కారణంగా ఇలా ఎందరో ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. పెద్దవారు తమ పిల్లలపై ఓ కన్నేసి వుంచడం తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.