మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (07:12 IST)

రెండేళ్ళ చిన్నారికి హెచ్.ఐ.వి రక్తం ఎక్కించారు.. ఎక్కడ?

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. రెండేళ్ళ చిన్నారికి హెచ్.ఐ.వి రక్తాన్ని ఎక్కించారు. ఇటీవల రాష్ట్రంలోని సాత్తూరుకు చెందిన ఓ గర్భిణీకి హెచ్.ఐ.వి. రక్తం ఎక్కించిన వ్యవహారం పూర్తిగా మరిచిపోకముందే ఇలాంటి ఘటన మరొకటి రాష్ట్రంలో జరిగింది. ఇది ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది. జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తం ఎక్కించుకున్న రెండేళ్ళ చిన్నారికి హెచ్.ఐ.వి సోకినట్టు నిర్ధారణ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కోవైకు చెందిన ఓ జంట మూడేళ్ళ క్రితం వివాహం చేసుకుంది. వీరికి 2017, ఫిబ్రవరి 6వ తేదీన తిరుచ్చి ఆస్పత్రిలో ఆడ, మగ కవలలు జన్మించారు. ఆ శిశువుల బరువు తక్కువగా ఉండటంతో 38 రోజుల ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స చేశారు. ఈ క్రమంలో 2018, జూలై 11వ తేదీన దగ్గు, జలుబు రావడంతో తిరుప్పూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 
 
అక్కడ ఆ బాలిక ఆరోగ్యం విషమంగా ఉండటంతో కోయంబత్తూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి రక్తం ఎక్కించాలని వైద్యులు సిఫార్సు చేశారు. దీంతో ఆ చిన్నారికి కోవై ఆస్పత్రి వైద్యులు రక్తం ఎక్కించారు. పైగా గుండెలో రంధ్రం ఉందని వైద్యులు తేల్చారు. ఇంతలో ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకులోనైంది. దీంతో ఆ చిన్నారికి మళ్లీ రక్త పరీక్షలు చేయగా, చిన్నారికి హెచ్.ఐ.వి. సోకినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ మాటలు విన్న తల్లిదండ్రులు హతాశయులయ్యారు. తమకు హెచ్.ఐ.వి లేదనీ, కానీ తమ బిడ్డకు హెచ్.ఐ.వి ఎలా సోకిందని చెప్పారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోవై ఆస్పత్రి డీన్ మాట్లాడుతూ, ఆ చిన్నారికి రక్తం ఎక్కించింది తమ వైద్యులేనని, కానీ, అంతకుముందు ఆ చిన్నారికి ఎక్కడెక్కడ రక్తం ఎక్కించారో విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యాన్నికి రెండేళ్ళ చిన్నారి హెచ్.ఐ.వి బారినపడింది.