స్కూల్‌లో లేడీ టీచర్ల రీల్స్... లైక్స్ కోసం విద్యార్థులపై ఒత్తిడి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాలోని ఓ పాఠశాలలు కొందరు మహిళ ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువులు చెప్పడం మానేసి రీస్స్ చేస్తున్నారు. పైగా, వీటిని లైక్స్ చేసేలా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పాలంటూ ఒత్తిడి చేయసాగారు. ఇలా ప్రతినిత్యం వేధింపులకు గురిచేయడంతో వీటిని భరించలేని విద్యార్థులు ఆ లేడీ టీచర్ల వ్యవహారాన్ని బయటపెట్టారు. దీంతో ఈ అంశం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన మహిళా టీచర్లే సామాజిక మాధ్యమాలకు బానిసలు కావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పైగా, విద్యార్థులను వేధింపులకు గురిచేయడం వివాదంగా మారింది. సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు కోసం తాము చేసిన రీల్స్‌కు లైక్ కొట్టాలని, సబ్ స్క్రైబ్ చేసుకోవాలంటూ మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు.
తమ వీడియోలు షేర్ చేయకపోతే కొడతామని బెదిరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్థానిక విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వరి గుప్తా విచారణ చేపట్టారు. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఉపాధ్యాయులు చదువులో భాగంగా విద్యార్థులకు ఉపయోగకరమైన వీడియోలను రూపొందించినట్లు తెలిపారు.