సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (18:27 IST)

ఉపరాష్ట్రపతి వెంకయ్యకు రెండోసారి కరోనా పాజిటివ్

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. 
 
వైద్యుల సూచన మేరకు ఆయన వారం రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అలాగే, ఇటీవల తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఆయన గత 2020 సెప్టెంబరు నెలలో తొలిసారి కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ఉపరాష్ట్రపతి కార్యాలయం అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. "ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు" అని పేర్కొంది.