శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (08:58 IST)

జోరు వానలోనూ యాత్ర కొనసాగుతుంది.. కాశ్మీర్‌కు చేరుతాం : రాహుల్

rahul meeting
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కర్నాటక రాష్ట్రంలో అనూహ్య స్పందన వచ్చింది. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రాహుల్ తన యాత్రను కొనసాగించారు. ఆయనతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆ జోరు వర్షంలోనే ముందుకుసాగారు. ఆదివారం మైసూరులో కొనసాగిన భారత్ జోడో యాత్రా సమయంలో జోరు వర్షం కురిసింది. ఆ సమయంలో బహిరంగ సభకు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాహుల్ కూడా వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయుకుండా తన ప్రసంగాన్ని కొనసాగించగా, ఆ జోరు వర్షంలోనే సభికులంతా నిల్చొండిపోయారు. 
 
ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగిస్తూ, భారత్‌ను ఏకం చేయడంలో తమను ఎవరూ ఆపలేరన్నారు. కన్యాకుమారి నుంచి జమ్మూకాశ్మీర్ వరకు చేపట్టిన యాత్ర యధావిధిగా కొనసాగుతుందన్నారు. ఆదివారానికి ఈ యాత్ర 25వ రోజున మైసూరుకు చేరుకుంది. 
 
పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం ఆయనతోపాటు ముందుకు సాగారు. సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షంలోనూ ప్రసంగిస్తున్న రాహుల్‌ను చూసి జనం కరతాళ ధ్వనులతో మరింత ఉత్సాహాన్ని నింపారు. వర్షం కురుస్తుండగానే పార్టీలో చేరిక ప్రక్రియ కొనసాగింది. 
 
జోరు వర్షంలోనూ ప్రసంగాన్నికొనసాగించిన రాహుల్ అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'భారత్‌ను ఏకం చేయడంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు. భారత గొంతుకను వినిపించడంలో ఎవరూ మమ్మల్ని నిలువరించలేరు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగే యాత్రను ఎవరూ ఆపలేరు' అని ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించారు.