శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (10:09 IST)

మా లక్ష్యం గురి చూసి కొట్టడమే... శవాలను లెక్కించడం కాదు... ఎయిర్ చీఫ్

మా ప్రధాన కర్తవ్యం గురి లక్ష్యాలను ఛేదించడమేగానీ, శవాలను లెక్కించడం కాదని మీడియాకు భారత వైమానికదళ ప్రధానాధికారి బీఎస్ ధనోవా వెల్లడించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రతండాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన మెరుపు దాడుల్లో ఎంతమంది చనిపోయారన్న ప్రశ్నలకు ఆయన ఘాటుగానే సమాధానమిచ్చారు. 
 
'బాలాకోట్‌లో లక్ష్యాలను ధ్వంసం చేశాం. అది సుస్పష్టం. ఇక ఎంతమంది చనిపోయారన్న లెక్క ప్రభుత్వం చెప్పాలి. మేం కాదు.. మేమెన్నడూ మరణాల్ని లెక్కించం' అని ఆయన స్పష్టంచేశారు. 'నష్టం అంచనా అన్నది వేరే పని. ఆ సమయంలో ఆ స్థావరంలో ఎంతమంది ఉన్నారన్న దానిపై మృతుల సంఖ్య ఆధారపడుతుంది. ఈ పని ప్రభుత్వం చేస్తుంది' అని చెప్పారు. 
 
అదేసమయంలో 'మేం అడవుల్లోని చెట్లపై జారవిడిచి ఉండుంటే ఆయన (ఇమ్రాన్‌ఖాన్‌) ఎందుకు ప్రతిదాడికి దిగినట్లు? మేం ఓ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను ముందే సిద్ధం చేసుకుని దాన్ని కొడతాం. ఫిబ్రవరి 26న అలాగే చేశాం. లక్ష్యాల్ని ధ్వంసం చేశాం. దాన్ని చూశాకే పాక్‌ ప్రతీకార దాడులకు ప్రయత్నించింది' అని పేర్కొన్నారు. 
 
అత్యాధునికమైన ఎఫ్‌-16 యుద్ధవిమానాల్ని ఎదుర్కొనేందుకు మిగ్‌-21లు ఉపయోగించడాన్నీ సమర్థించుకున్నారు. 'మిగ్‌-బైసన్‌లు అత్యాధునికమైనవి. వాటికి కూడా ఆధునిక ఆయుధాలున్నాయి. అడ్వాన్స్‌డ్‌ రాడార్లున్నాయి. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాన్ని ఛేదించే క్షిపణులున్నాయి. అంచేత వాటిని ఎందుకు వాడకూడదు? ఏ యుద్ధవిమానాన్నైనా ఉపయోగించవచ్చు' అని ధనోవా వివరణ ఇచ్చారు.