శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (10:59 IST)

ఎన్నికల్లో ఓటమి తర్వాత సిగ్గుపడాల్సిన పనిలేదు : మాజీ సీఎం నవీన్ పట్నాయక్

naveen patnaik
ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) ఓటమి పాలైంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి పదవికి నవీన్ పట్నాయక్ రాజీనామా చేశారు. 24 యేళ్ళ క్రితం ఆయన తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో నవీన్ పట్నాయక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టినపుడు ఒరిస్సా జనాభాలో 70 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉండేవారని, కానీ తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో పేదరికం 10 శాతానికి తగ్గిపోయిందని ఆయన గుర్తుచేశారు. 
 
రాష్ట్రాభివృద్ధి కోసం బీజేడీ పనిచేస్తూనే ఉంటుందని చెప్పారు. 'వ్యవసాయం, సాగునీరు, మహిళా సాధికారత విషయంలో మనం తీసుకొచ్చిన మార్పులు రాష్ట్రాన్ని ఈ స్థానంలో నిలిపాయి. అందువల్ల మనం ఇప్పుడు దేనికీ సిగ్గుపడాల్సిన పనిలేదు' అని పట్నాయక్ వ్యాఖ్యానించారు.
 
కాగా, నవీన్ పట్నాయక్ రాజీనామాతో ఒడిశా రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. 2000 సంవత్సరం మార్చి 5న నవీన్ పట్నాయక్ తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు ఆయన సీఎం పదవి చేపట్టారు. ఈ సమావేశానికి ముందు పట్నాయక్‌ను బీజేడీ ఎమ్మెల్యే అరుణ్ సాహూ కలిశారు. 
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవీన్ పట్నాయక్ పెద్ద మనసుగల వారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారని చెప్పారు. ఆయనకు రుణపడి ఉంటామన్నారు. ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకుగాను అధికార బీజేడీ కేవలం 51 సీట్లలో గెలవగా ప్రతిపక్ష బీజేపీ ఏకంగా 78 సీట్లలో విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలవగా మూడు చోట్ల స్వతంత్రులు, ఒక స్థానంలో సీపీఎం గెలిచింది.