సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 జూన్ 2024 (20:12 IST)

బెంగుళూరు రేవ్ పార్టీ : సినీ నటి హేమ మా నుంచి సస్పెండ్?

Hema
బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్న సినీ నటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సస్పెండ్ వేటు వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బుధవారం జరిగిన 'మా' సమావేశంలో హేమ సస్పెండ్‌ విషయమై చర్చ జరిగింది. అయితే, తుది నిర్ణయానికి ఇంకా రాలేదు. ఈ విషయమై అధ్యక్షుడు మంచు విష్ణు గురువారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
 
గత నెలలో బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీ జరిగిన రేవ్‌ పార్టీలో కేసులో హేమ కూడా పాల్గొన్న విషయం తెల్సిందే. ఇందులో వంద మందికిపైగా పాల్గొనగా వీరందరికీ రక్త పరీక్షలు నిర్వహించారు. ఇందులో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. 
 
ఆమె విచారణకు హాజరు కావాలని పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇవ్వగా.. విచారణకు హేమ హాజరుకాలేదు. ఇటీవల మరోసారి నోటీసులు ఇచ్చి.. విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను అనేకల్‌లోని నాలుగో అదనపు సివిల్‌, జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ముందు పరచగా.. జూన్‌ 14 వరకు ఆమెకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.