బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 జులై 2023 (19:14 IST)

ఐ ఫోన్ కోసం కన్నబిడ్డను అమ్మేశారు : వెస్ట్ బెంగాల్‌లో దారుణం

new born baby
కన్నబిడ్డలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ, ఇక్కడ ఏమాత్రం దయాహృదయం లేని తల్లిదండ్రులు తమ బిడ్డను ఐఫోన్ కోసం అమ్మేశారు. సోషల్ మీడియాలో రీల్స్ తయారు చేసేందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణ జిల్లాలోని పానిహతిలోని గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన జయదేవ్‌, సాథి దంపతులకు ఏడేళ్ల కూతురు, 8 నెలల కొడుకు ఉన్నారు. కొద్దిరోజులుగా భార్యభర్తల ప్రవర్తనలో మార్పురావడం చుట్టుపక్కల ఉండే వారికి అనుమానం కలిగింది. వారితోపాటు 8 నెలల కొడుకు కనిపించకపోవడం ఆ అనుమానాన్ని మరింత బలపరిచింది. 
 
దాంతోపాటు ఆ దంపతులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి రీల్స్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గుర్తించారు. పసికందు గురించి స్థానికులు ప్రశ్నించగా.. అమ్మేసినట్లు జయదేవ్‌, సాథి తెలిపారు. ఆ డబ్బుతో ఐఫోన్ కొన్నట్లు చెప్పారు. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో భార్యభర్తలను అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
సోషల్‌ మీడియా రీల్స్‌ చేసేందుకు ఐఫోన్ కొనాలని నిర్ణయించుకుని.. బిడ్డను ఖార్‌దాహ్‌ ప్రాంతంలో నివసించే ప్రియాంక అనే మహిళకు అమ్మేసినట్లు తెలిపారు. ఆ డబ్బుతో ఐఫోన్ కొన్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. పసికందును అమ్మిన తర్వాత కుమార్తెను కూడా అమ్మేందుకు జయదేవ్ ప్రయత్నించాడని, వెంటనే పోలీసులకు సమాచారం అందించామని స్థానిక కౌన్సిలర్‌ తారక్ గుహ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జయదేవ్‌, సాథిలతోపాటు పసికందును కొన్న మహిళను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.